రూ.200 కోట్లు టార్గెట్‌...48 గంటల పాటు నాన్‌ స్టాప్‌ షోలు!

14:18 - November 1, 2018

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘సర్కార్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దీపావళి సందర్బంగా ఈచిత్రాన్ని ఈనెల 6న విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల టార్గెట్ తో ఈ చిత్రం రంగంలోకి దిగబోతుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు మరియు కేరళలో కూడా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కేరళలో విజయ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ గత చిత్రాలు మలయాళంలో డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి - అక్కడ డైరెక్ట్ సినిమాల మాదిరిగా వసూళ్లు దక్కించుకున్నాయి. విజయ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో కేరళలో ఒకటి రెండు థియేటర్లలో 24 గంటల నిర్విరామ షోలు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెల్లవారు జామున అయిదు గంటల షోతో మొదలు పెట్టి 24 గంటలు ఒక షో తర్వాత ఒకటి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ వేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా కేరళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చెన్నైలోని రోహిణి థియేటర్ లో ఏకంగా నాన్ స్టాప్ 48 గంటల షోల కోసం అనుమతి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ అభిమానులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుతం ఏకధాటిగా 48 గంటల షోలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అదే కనుక జరిగితే విజయ్ సర్కార్ కు అరుదైన రికార్డు దక్కడం ఖాయం.