రిలీజైన ' శైలజా రెడ్డి అల్లుడు ' ట్రైలర్‌

14:58 - August 31, 2018

శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా నాగచైతన్య, మారుతి కాంబినేషన్‌లో రూపొందింది. మారుతి మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య.  ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌  నిర్మిస్తున్నారు. దీనిలో నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్‌  నటించడం జరిగింది. సీనియర్‌ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు.

కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్‌ డైలాగ్స్‌, ట్విస్ట్‌లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్‌లోనూ తన మార్క్‌ కనిపంచేలా చేశాడు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, పృథ్వీ కామెడీ పంచ్‌లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.