రాష్ట్రంలో బీజేపీకి ఇంతటి దుస్థితా?

16:52 - October 30, 2018

రాష్ట్రంలో వత్రం చెడి ఫలితం దక్కకుండా అయిపోయింది బీజేపీ పరిస్థితి. ముందస్తు ఎన్నికల వేళ మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో చేతకాని తనం ఆ పార్టీని కోలుకోకుండా చేస్తోందట. తెలంగాణలో ఉన్న మొత్తం అన్ని పార్టీల్లోకి బీజేపీ పరిస్థితే మరీ తీసికట్టుగా తయారుకావడం ఇప్పుడా పార్టీని కలవరపరుస్తోంది. మొత్తం తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో పోటీచేస్తామని ప్రకటించిన బీజేపీ కలలు కల్లవుతున్నాయి. ఇప్పటికి కేవలం 38 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. అందులో పట్టుమని పది సీట్లపై మాత్రమే ఆశలున్నాయట.. మిగతా వారంతా నామికే వాస్తే అన్న ప్రచారం జరుగుతోంది. ఇక మిగతా 80కు పైగా సీట్లలో పోటీచేసేందుకు ప్రస్తుతం నాయకులే లేరట.. బీజేపీ తరఫున నాయకులే లేని ఈ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని.. టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ను మించి ప్రత్యామ్మాయంగా నిలబడుతుందని బీరాలు పోవడం రాజకీయంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. ఇతర పార్టీల నుంచి వలస నాయకులు వస్తే తప్ప .. ఆ పార్టీ రెండో విడత అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉందట.  బీజేపీకి తొలి నుంచి రాష్ట్రమంతా పోటీచేసే శక్తి లేదు.. నాయకులు కూడా లేరు. నవంబర్ 1న కాంగ్రెస్ ప్రకటించే జాబితాతో అసంతృప్తి అసమ్మతి బయటపడడం ఖాయం. చాలా మంది టికెట్ దక్కని కాంగ్రెస్ రెబల్స్ ను చేరదీసి బేరసారాలు జరిపి.. నవంబర్ 2న రెండో జాబితాను విడుదల చేయాలని కమల నాథులు ప్లాన్ చేశారట.. ఇలా వలస నాయకుల మీదే బీజేపీ ఆశలు పెట్టుకునే దుస్థితి ప్రస్తుతం ఆపార్టీని కలవరపెడుతోందట.