రాఫెల్‌ డీల్‌లో మోడీ అక్రమానికి మరో సాక్ష్యం దొరికిందట!

17:36 - November 17, 2018

రాఫెల్‌ ఒప్పందంలో మోదీ సర్కారు అవినీతిపై రోజుకో తిరుగులేని సాక్ష్యం బయటపడుతోందని కాంగ్రెస్‌ పేర్కొంది. ‘రాఫెల్‌ డీల్‌లో మోదీ అక్రమానికి మరో సాక్ష్యం ఇదిగో’... అంటూ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశ పత్రాన్ని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా శుక్రవారం బయటపెట్టారు. దీని ప్రకారం దసో ఏవియేషన్స్‌ నుంచి అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌కు 50 ఏళ్లలో ఏకంగా 1.05 లక్షల కోట్లు వస్తాయని తెలిపారు. '' 36 రాఫెల్‌ విమానాలను రూ.59 వేల కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యాన్ని దసో సంస్థ రిలయన్స్‌తో కుదుర్చుకుంది. దీని ద్వారా రిలయన్స్‌ డిఫెన్స్‌కు 50ఏళ్లలో ఏకంగా 1,05,000 కోట్ల రూపాయలు లభిస్తాయని ఐసీఐసీఐ మేనేజ్‌మెంట్‌ బోర్డు అంచనా వేసింది. డీల్‌ విలువను పెంచి చూపారనేందుకు ఇది తిరుగులేని సాక్ష్యం.ఈ విషయాన్ని ఇప్పటిదాకా దాచిపెట్టారు '' అని ఖేరా తెలిపారు. ‘ ధర రహస్యం ‘అని కేంద్రం చేస్తున్న ప్రకటనలోనూ నిజం లేదన్నారు. '' రాఫెల్‌ డీల్‌తోపాటు ఆఫ్‌సెట్‌ భాగస్వామ్యం విలువను ఎందుకు బయటపెట్టడంలేదు? విమానం ధరను రిలయన్స్‌ డిఫెన్స్‌, రక్షణ శాఖ మాజీ మంత్రి బయటపెట్టినప్పుడు... కేంద్రం మాత్రం ఎందుకు బయటపెట్టడంలేదు''  ? అని నిలదీశారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరపడమొక్కటే పరిష్కారమని ఖేరా అభిప్రాయపడ్డారు.