రాఫెల్‌ డీల్‌పై మరో ఫిర్యాదు

13:00 - November 24, 2018

రాఫెల్‌ డీల్‌పై మరో కొత్త ఫిర్యాదు వెలువడింది.  ఫ్రాన్స్‌లో రాఫెల్‌ ఒప్పందంపై మరో కొత్త ప్రకంపన మొదలైంది. ఆర్థిక నేరాలపై పోరాడే స్వచ్ఛంద సంస్థ, పౌర సమాజ బృందం.. షెర్పా అసోసియేషన్‌ ఈ డీల్‌పై ఆ దేశ '  ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్‌ ' కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఏ ' నిబంధనల ' ప్రకారం 2016లో భారతదేశానికి దసో కంపెనీ 36 రాఫెల్‌ జెట్‌ విమానాలను అమ్మిందో, రిలయన్స్‌ను తన భాగస్వామిగా ఎలా ఎంచుకుందో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ ఒప్పందానికి సంబంధించి అవినీతి, అనుచిత ప్రయోజనాలు చేకూర్చడం, ప్రభావితం చేయడం, మనీలాండరింగ్‌ వంటి అంశాలపై దర్యాప్తు జరపాల్సిందిగా ఫైనాన్షియల్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయాన్ని కోరింది. షెర్పా సంస్థ ఫిర్యాదుపై ఫ్రాన్స్‌కు చెందిన  ' మీడియాపార్ట్‌ ' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని జరిగిన పరిణామాలు సూచిస్తున్నాయని షెర్పా వ్యవస్థాపకుడు విలియం బోర్డన్‌ వ్యాఖ్యానించినట్టు అందులో పేర్కొంది. దీనిపై వీలైనంత త్వరగా విచారణ ప్రారంభం కావాలని ఆయన ఆశించారు.