రానున్న 4 నెలల్లో సగం ఏటీఎంలు క్లోజ్‌...

10:45 - November 22, 2018

రానున్న 4 నెలల్లో సగం ఏటీఎంలు క్లోజవుతాయట!. దేశవ్యాప్తంగా ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో 1.13 లక్షల ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని బుధవారంనాడు  ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) తెలిపింది. దీని ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) హెచ్చరిస్తోంది. నియంత్రణాపరమైన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతోందని, దీని వల్ల వచ్చే మార్చినాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని సీఏటీఎంఐ తెలిపింది. వీటిలో దాదాపు లక్ష ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు, 15 వేల వరకు వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు ఉండవచ్చని వెల్లడించింది. పట్టణేతర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏటీఎంలు మూతపడతాయని పేర్కొం ది. ఏటీఎంల మూసివేత మూలంగా వేలాది ఉద్యోగాలు గల్లంతుకావడమేకాకుండా ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌కు సంబంధించిన ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ప్రభావితమవుతాయని పేర్కొంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలను పొందుతున్నవారు ఏటీఎంల ద్వారానే నగదును తీసుకుంటున్నారని, ఇలాంటి వారికి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపింది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్స్‌తోపాటు నగదు నిర్వహణకు సంబంధించిన నూతన ప్రమాణాలు,నగదు లోడింగ్‌కు సంబంధించి క్యాసెట్‌ స్వాప్‌ విధానంలో తెచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ గిట్టుబాటు కావడం లేదని, ఇదే ఏటీఎంల మూసివేతకు దారితీస్తోందని సీఏటీఎంఐ అంటోంది. కొత్తగా తెచ్చిన నోట్ల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల దీనికి అనుగుణంగా ఏటీఎంలను మార్చాల్సి వచ్చింది. ఫలితంగా ఏటీఎంలను నిర్వహించే సంస్థలపై అదనపు భారం పడింది. ఏటీఎం నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను పాటించాల్సి రావడంతో నిర్వహణ మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారుతోందని సీఏటీఎంఐ అంటోంది. అదనపు వ్యయాలను భరించేందుకు బ్యాంకులు ముందుకు వస్తే పరిశ్రమ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంది.