రానున్న కాలమంతా ఎన్నికల సీజనే..

11:47 - December 14, 2018

తెలంగాణ ఎన్నికల హడావుడి ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల పండుగ తెలంగాణ ప్రజలను ఆనందం... ఆశ్యర్యం.... వివాదం... విషాదం వంటి పలు అనుభవాలను పంచింది. ఎన్నికలు ముగిసాయి..... ఓట్ల లెక్కింపూ ముగిసింది. విజేతలెవరో... పరాజితులెవరో తేలిపోయింది.  అంతే ఎన్నికలు ముగిసాయని అందరూ అనుకుంటున్నారు. కాని కాదు... ఇక ముందు రానున్న కాలమంతా ఎన్నికల సీజనే. పెళ్లిళ్ల సీజన్ వచ్చినట్లుగా ఈ సంవత్సరం ఎన్నికల సీజన్ వచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో  పంచాయతీ ఎన్నికలను సాధ్యమైంత తర్వగా నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీంతో మరో రెండు మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.పంచాయతీ ఎన్నికలు పార్టీల పరంగా జరగకపోయినా అభ్యర్ధుల ఎంపిక - ప్రచారం - చివరికి ఓటర్లు గెలిపించే అంశం కూడా రాజకీయ పార్టీల పరంగానే ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వారు సర్పంచ్ లు అయ్యారో - ఏ పార్టీకి ఖాతాలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో లెక్కలు కడతారు. ఈ ఎన్నికలకు ముందో... కాసింత వెనుకో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల పండుగ ప్రారంభమవుతుంది. దేశ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కావడంతో సార్వత్రిక ఎన్నికల హడావుడి చాలానే ఉంటుంది. ఈ ఎన్నికల హంగామా దాదాపు మూడు నెలల వరకూ ఉంటుంది. ఇక ఈ మూడు నెలలూ దేశవ్యాప్తంగా ప్రచార హోరు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అగ్ర నాయకులు ప్రచారం - వ్యూహాలు - ప్రతి వ్యూహాలు - ఎత్తులు - పై ఎత్తులు - పొత్తులు - చిత్తులు ఇలా ఈ మూడు నెలల పాటు లోక్ సభ ఎన్నికల హంగామా ఉంటుంది. అన్నట్లు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా శాసనసభ ఎన్నికల జోరుంటుంది.