మోడీ - కేసీఆర్‌...వీరిలో ఎవరికి ఓటేసినా ఒక్కటే...!

10:32 - October 3, 2018

కేసీఆర్‌కు ఓటు వేస్తే ప్రధాని మోదీకి వేసినట్టే అవుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో మధుయాష్కి విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు సహా అందరినీ కేసీఆర్‌ మోసం చేశారని మధుయాష్కీ ఆరోపించారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని ప్రకటించి పట్టించుకోలేదని, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రగతి భవన్‌కు గులాం అవుదామా, ప్రజాస్వామ్య తెలంగాణ కోరుకుందామా.. అన్నది ప్రజలే నిర్ణయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు దోచుకుంటున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ మధ్య సంబంధాలను, కేసీఆర్‌ కుటుంబ అక్రమాల వివరాలను త్వరలోనే బయటపెడతామన్నారు. ఉద్యమకాలంలో కేటీఆర్‌ వ్యాపారంలో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని, తెలంగాణ జాగృతి పేరుమీద వసూళ్లు చేశారని ఆరోపించారు. ఐఎంజీ భూముల కేసులో అధికార పార్టీ నేతలకు ఎన్ని డబ్బులు ముట్టాయని ప్రశ్నించారు.  వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచే పోటీ చేస్తానని  మధుయాష్కి గౌడ్‌ స్పష్టం చేశారు.