మేని ఛాయ కోసం

13:37 - August 16, 2018

చాలామంది మేని ఛాయ కోసం డబ్బులు ఖర్చు పెడుతూ...ఖరీధైన ఉత్పత్తులను వాడుతూ, బ్యూటీ పార్లర్‌ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని ఔషదాలతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
టమాటా:- టమాటారె మనం దాదాపు అన్ని వంటలలో ఉపయోగిస్తాము. టమాటా ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. టమాటాను గుజ్జుగా చేసి, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. టమాటాలో ఉండే లైకోపీన్‌ అనే పదార్ధం సూర్యకాంతి వలన డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి కాంతివంతమయ్యేలా చేస్తుంది. 
తేనె:- తేనెలో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి వుంటాయి. తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్కపొడి కలిపి ముఖానికి అప్లై చేసిన కొద్ది సేపటి తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖ కాంతి రెట్టింపు అవుతుంది. 
ఉసిరి:- ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. ప్రతి రోజూ పడుకోవటానికి ముందు ఒక చెంచా ఉసిరి రసాన్ని, ఒక చెంచా తేనెను కలిపి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. 
పెరుగు:- పెరుగు రోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు చర్మ సౌందర్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిలో ఉండే లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి మృదువైన చర్మాన్ని అందిస్తుంది.