మెట్రో సేవలు ప్రారంభమై ఏడాది గడవకముందే...విద్యుత్‌ వైర్లు కట్‌

11:36 - October 15, 2018

మెట్రో సేవలు ప్రారంభమై ఏడాది గడవకముందే విద్యుత్‌ వైర్లు తెగిపోవడం, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంపై అధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. దీనిపై ఎలక్ర్టికల్‌ విభాగం నిపుణులతో మెట్రో ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా అందుబాటులో ఉన్నా, బయటి నుంచి ఎలాంటి విపత్తులు లేకపోయినా అకస్మాత్తుగా విద్యుత్‌ వైర్లు తెగిపోవడం ఏమిటని మెట్రో వర్గాలను ఆలోచనలో పడేసింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు విద్యుత్‌ వ్యవస్థే కీలకం. అలాంటి వ్యవస్థలో మొదటి ఆటంకం కలగడంతో మెట్రో సేవలపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల తరబడి మెట్రో రైళ్లు ఎక్కడివక్కడనే నిలిచిపోయాయి. నిమిషాల్లోనే ముగుస్తుందనుకున్న ప్రయాణం కాస్తా విద్యుత్‌ సరఫరాకు కలిగిన అంతరాయం వల్ల గంటల తరబడి కొనసాగింది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులతో అందుబాటులోకి వచ్చిన మెట్రో ప్రాజెక్టులో మొదటి సారి ఎదురైన ఆటంకాన్ని మెట్రో అధికారులు పెద్ద గుణపాఠంగా భావిస్తున్నారు.

మెట్రో సేవలు ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చీఫ్‌ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణ చేసి సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాతే మెట్రో రైలుకు సంబంధించిన టెస్ట్‌రన్‌, ట్రయల్‌ రన్‌లను నిర్వహిస్తారు. ఆ రెండు పరీక్షల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సరిగ్గా ఉంటేనే అంతిమంగా మెట్రో సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. అవి జరిగినాక కూడా ఏడాదిగడవకముందే ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై అధికారులు మండిపడుతున్నారు. అందులో ఎంత నాణ్యత వుందో అర్దమవుతుందీ అంటూ కొన్ని వార్తలు తలెత్తుతున్నాయి.  మొదటి సారిగా జరిగిన సంఘటన కావడంతో కొంత ఆలస్యమైందని, మున్ముందు ఇలాంటివి జరుగకుండా, జరిగినా వేగంగా పరిష్కరించేలా ఎలక్ర్టికల్‌ విభాగం పని చేస్తుందని మెట్రో వర్గాలు తెలిపాయి. మెట్రో రైళ్లు అకస్తాత్తుగా ఆగిపోతే వాటిని ఆయా కారిడార్‌లలో నిలిపేందుకు వీలుగా ఒక చోట సమాంతరంగా మూడో ట్రాక్‌ను నిర్మించామని, అయితే శనివారం జరిగిన అంతరాయం రైలుకు సంబంధించినది కాదని, విద్యుత్‌ తీగలు తెగడంతో కరెంట్‌ సరఫరా లేక ఇతర రైళ్లను నడపలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇదీ మొట్టమొదటి అనుభవమని, దీనిని పరిగణలోకి తీసుకొని భవిష్యతులో వచ్చే ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు తెలిపారు. సమస్యలను వేగంగా పరిష్కరించి మెరుగైన మెట్రో సేవలను అందిచేందుకు కృషి చేస్తామని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి.