మెగాస్టార్‌ సినిమా పేరుతో...విజయ్ దేవరకొండ సినిమా

10:47 - December 13, 2018

యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు అబ్బాయిలు .. అటు అమ్మాయిలు కూడా ఆయన సినిమాలకి ఎగబడిపోతున్నారు. ఈ క్రేజ్ కారణంగా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం అతడు మైత్రి మూవీమేకర్స్ పతాకంపై `డియర్ కామ్రేడ్` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ఓ తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రంలోనూ నటించనున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పటికే గీతా ఆర్ట్స్- స్టూడియోగ్రీన్ ఎంటర్టైన్మెంట్స్- యువి క్రియేషన్స్ లోనూ మళ్లీ సినిమాలు చేయనున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఇంతలోనే మరో ప్రాజెక్టు గురించిన సమాచారం అందింది. దేవరకొండ నటించే తదుపరి సినిమా టైటిల్ `హీరో`. దీనిని కూడా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనుంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఇతరత్రా వివరాలేంటో తెలియాల్సి ఉందింకా. హీరో అన్న టైటిల్ మెగాస్టార్ కి మాత్రమే యాప్ట్. మేటి క్లాసిక్ దర్శకుడు విజయ్ బాపినీడు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నటించి నిర్మించిన `హీరో`లో చిరు హీరోయిక్ వేషాలు ఓ రేంజులో ఉంటాయి. చిరంజీవి సరసన రాధిక కథానాయికగా నటిస్తే చక్రవర్తి సంగీతం బ్లాక్ బస్టర్ అయ్యింది. 1984లో రిలీజైన ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ కంటెంట్తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇన్నాళ్టికి మళ్లీ ఆ టైటిల్ని విజయ్ దేవరకొండ టచ్ చేయడంతో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ సినిమా చిరంజీవి హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలాగే విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను కూడా 'హీరో' సినిమా మరోస్థాయికి తీసుకెళుతుందేమో చూడాలి.