మీడియాపై మండిపడ్డ హీరో శివాజీ

12:18 - December 18, 2018

సంచలన వ్యాఖ్యలు చేసే హీరో శివాజీ మరోసారి మీడియాపై మండిపడ్డారు. అంతేకాదు. ఆయన ఫోటోసు తీశారని మీడియా ప్రతినిధుల ఫోన్లు తీసుకోని వాటిని డిలీట్‌ చేశారట. వివరాల్లోకి వెలితే...కృష్ణా జిల్లా గన్నవరంలో ఇటీవల ప్లాట్లను కొనుగోలు చేసిన సినీనటుడు శివాజీ, వాటి రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చిన వేళ, మీడియాపై చిందులు తొక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శివాజీని ఫోటోలు తీస్తూ, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేయగా, "ఏం రాస్తారో రాసుకోండి... మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారంతేగా" అని ఆయన మండిపడ్డారు. శివాజీ నేరుగా సబ్ రిజిస్ట్రార్ చాంబర్ లోకి వెళ్లి పని ముగించుకుని నేరుగా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, శివాజీ వ్యక్తిగత సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఫోన్ లు బలవంతంగా లాక్కుని తీసిన ఫోటోలను డిలీట్ చేశారని కొందరు మీడియా ప్రతినిధులు ఆరోపించారు. కాగా, చిన్న అవుటపల్లి పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో రెండు ప్లాట్లను శివాజీ కొనుగోలు చేశారు.