' మీటూ ' ప్రకంపనలు...సేథ్‌ని పక్కనపెట్టిన ' టాటా '

13:04 - October 29, 2018

' మీటూ ' కారణంగా ఇప్పటికే కేంద్రమంత్రి ఎంజే అక్బర్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పదవులు పోగొట్టుకోగా.... తాజాగా ప్రముఖ రచయిత, నటుడు సుశీల్ సేథ్‌ వంతు వచ్చింది. '  క్యాలెండర్ గర్ల్స్' నటుడిగా గుర్తింపుతెచ్చుకున్న సేథ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు దాదాపు ఆరుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ' మీటూ ' ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటి,  మోడల్ దియాంద్ర సోరెస్, సినీ నిర్మాత నటాషా, రచయిత ఇరా త్రివేది, జర్నలిస్టు మందాకినీ గెహ్లాల్, ఇషిత యాదవ్, జాస్మిన్ దేవేకర్ సహా తదితరులు ఆయనపై గొంతెత్తడంతో టాటా సన్స్ ఆయనను పక్కన బెట్టింది. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు  మహిళలు ఆరోపించడంతో టాటా గ్రూప్ కంపెనీ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్ కన్సల్టెంట్‌గా ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించింది.సేథ్‌పై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన మీదట కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2016లో టాటా గ్రూప్ చైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత.. ఆ వివాదం నుంచి కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌‌‌కు మళ్లీ పునర్వైభవం తేవడంలో సేథ్ కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు.