మిర్చి లుక్‌తో అనుష్క ఈజ్‌ బ్యాక్‌

11:29 - December 20, 2018

‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క వరుసగా చిత్రాలు చేస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా బరువు కారణంగా సినిమాలే చేయకుండా ఉంది. బరువు తగ్గకుండా చేసిన భాగమతి మూవీ నిరాశ పర్చింది. అదే బరువుతో సినిమాలు చేస్తే ప్రేక్షకులను అలరించడం కష్టమని - అదే విధంగా హీరోలతో ఛాన్స్ లు కూడా రావని నిర్ణయించుకున్న అనుష్క తన బరువు తగ్గించుకునేందుకు దాదాపు రెండు సంవత్సరాలుగా కిందా మీదా పడుతూనే ఉంది. గత కొంత కాలంగా మరింతగా కష్టపడ్డట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు అనుష్క తన మునుపటి రూపంకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అనుష్క బరువు తగ్గడమే ఆలస్యం ఆమెతో సినిమాలు చేయాలని పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఆమెకు అడ్వాన్స్ లు కూడా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. కాని అనుష్క మాత్రం ఆచి తూచి సినిమాలకు కమిట్ అవుతుంది. అనుష్క ప్రస్తుతానికి కోన వెంకట్ నిర్మాణంలో మాధవన్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు కమిట్ మెంట్ ఇచ్చింది. ఆసినిమా ఫిబ్రవరి నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది.  గత కొన్నాళ్లుగా మీడియా కళ్లకు దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క అతి త్వరలోనే రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనబోతుంది. అప్పుడు ఆమె మీడియా కళ్లకు చిక్కడం ఖాయం. అయితే అంతకు ముందే ఆమె బరువు గురించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అనుష్క చాలా బరువు తగ్గిందని - మిర్చిలో ఎలాంటి లుక్ లో ఆమె కనిపించిందో ఇప్పుడు అలాగే కనిపించబోతుందని అంటున్నారు. అనుష్క మళ్లీ మునుపటి రూపంలోకి రావడంతో స్టార్ హీరోలు సైతం ఆమెతో నటించేందుకు ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ మూవీలో గెస్ట్ గా కూడా అనుష్క నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ వస్తున్న వార్తలతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు