మావోయిస్టులకు ఆ రెండు పార్టీల నేతలే టార్గెట్‌

10:07 - October 8, 2018

మావోయిస్టులు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలనే టార్గెట్‌ చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్ర చార సమయంలో ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించే టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులను టార్గెట్‌గా చేసుకుంటున్నాయా?, తెలంగాణలో నక్సలిజాన్ని పూర్తిగా ఏరివేశామంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై, నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలను తగ్గించామని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టు దళాలు సన్నద్ధమవుతున్నాయా?...ఈ ప్రశ్నలకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ), రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టే సబ్సిడియరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్నారని రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. స్టేట్‌ మల్టీ ఏజెన్సీస్‌ కమిటీ (స్మాక్‌), ఇతర వర్గాలు సమాచార మార్పిడికి చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఛత్తీ్‌సగఢ్‌లో వచ్చేనెల 12న తొలి దశ ఎన్నికలు జరగనున్న 18 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో ట్రయల్స్‌తో ప్రారంభించి తెలంగాణ ఎన్నికల సమయానికల్లా ఇక్కడ తమ వ్యూహాలను అమలు చేయాలని మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాయి. వారి వ్యూహాలను తిప్పికొట్టాలని రాష్ట్ర పోలీసు వర్గాలకు సూచించాయి. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌లతో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాలు, గోదావరి తీరప్రాంతాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం, నక్సల్స్‌ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న భద్రాది-కొత్తగూడెం, జయశంకర్‌-భూపాలపల్లి, కుమ్రంభీం, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదివారం ఆదేశించారు.