మహిళా భక్తుల కోసం హెలికాప్టర్లు

13:22 - November 11, 2018

ఇటీవల శబరిమలకు అన్ని వయసుల ఆడవాళ్లు వెల్లేందుకు అనుమతినిస్తూ సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ తీర్పును సైతం లెక్కచేయకుండా అన్ని వయసుల ఆడవాళ్లు ఆలయంలోకి ప్రవేశించడానికి వీళ్లేదు అంటూ...ఆలయ పూజారులు, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, మనువాద శక్తులు గొడవలు, వివాదాలు సృష్టిస్తున్నారు. అయితే ఈ నెల 17 నుంచి మండల పూజలకు 500 మంది మహిళలు రానున్నారు. ఆలయానికి వెళ్లే మహిళలను అయ్యప్ప భక్తులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు రక్షణగా నిలిచినా సన్నిధానం చేరుకోలేకపోతున్నారు!దీంతో మహిళలను కోచి, తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లలో శబరిమలకు తరలిస్తే ఎలా ఉంటుందని కేరళ పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే హెలికాప్టర్ల వినియోగం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అత్యవసర సమయాల్లో భక్తులను తరలించేందుకు మాత్రమే హెలికాప్లర్లను వినియోగిస్తారని పేర్కొంటున్నారు. మరోవైపు ఆలయంలోకి అన్నివయసుల మహిళలనూ అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై రెండు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఈ నెల 13న విచారణకు రానున్నాయి. వాటిపై వచ్చే తీర్పునకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని కేరళ పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును సమర్థించుకుంటే మహిళలు ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తే హెలిప్యాడ్‌ కోసం అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి.