మళ్లీ రాముడిని వాడుకుంటున్న బీజేపీ

12:07 - October 22, 2018

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముస్లింలు కానీ మద్దతు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మోడీ మంత్రులలో ఒకరు గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగానూ...వివాదాస్పదంగానూ మారాయి.  ముస్లింలు అంతా ముందుకు వచ్చి రామమందిర నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఆయన వ్యాఖ్యానించటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. కేంద్రమంత్రి హోదాలో ఉండి.. అన్ని వర్గాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఒక వర్గానికి మద్దతుగా వాదనలు వినిపించటం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. "ముస్లింలు రాముడి వారసులు. వారు మొగల్స్ వారసులు కాదు. అందుకే వారు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మద్దతు ఇవ్వాలి. రామాలయం కోసం ముస్లింలు మద్దతు ఇవ్వకుంటే వారు హిందువుల ద్వేషాన్ని చూడాల్సి వస్తోందన్న విషయం వారికి బాగా తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు. 
కేంద్ర చిన్న.. మధ్య తరహా  పరిశ్రమల శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన బాగ్ పట్ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఎక్కువమంది పిల్లల్ని కనకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న మాటతో పాటు.. అధిక సంతానం కలగకుండా ఉండే విషయంలో వ్యతిరేకించే వారి ఓటుహక్కును రద్దు చేయాలన్న వ్యాఖ్యను చేశారు. భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను బాధ్యతాయుతంగా కాకుండా సంచలనాలకుకేంద్రంగా ఉండేలా మాట్లాడటం మంచిది కాదన్న విషయాన్ని ప్రధాని తన మంత్రికి చెబితే బాగుంటుంది. నీతులు చెప్పే ప్రధాని.. తన మంత్రులకు.. పార్టీ నేతలకు చెప్పకపోవటం ఏమిటి?  

ఇదిలా వుంటే...అసలు బీజేపీకి రామమందిరం కట్టే ఉద్దేశమే లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే... ఈపాటికి ఎపుడో కట్టేసేది. ఇపుడు కూడా కేవలం తాము ఎంతకయినా తెగిస్తాం అని జనాలను భ్రమింపజేయడం తప్ప బీజేపీ రామమందిరం కట్టే సాహసం చేయదు అన్నది విశ్లేషకుల మాట.