మళ్లీ అంబానీదే అగ్రస్థానం

14:49 - October 5, 2018

రోజు రోజూ కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొస్తున్నారు. అయితే వీరందరూ..కొంత కాలం వరకూ లాభాల భాట పట్టినప్పటికీ...ఎక్కడో ఒకచోట నష్టంలో కూరుకుపోతుంటారు. ఎప్పుడూ నెం.1గా వుండటం అందరికీ సాధ్యం కాదు. కానీ అంబానీ మాత్రం నాకు సాధ్యమే అంటున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ 2018 సంవత్సరానికి 100 మంది సంపన్న భారతీయులతో ఓ జాబితాను తాజాగా రూపొందించింది. ఇందులో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 4730 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.3.5 లక్షల కోట్ల రూపాయలు. భారత్ లో అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్ నిలవడం వరుసగా 11వసారి కావడం విశేషం. రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ విజయంతో ముకేశ్ సంపద ఏడాదిలో ఏకంగా రూ.67 వేల కోట్లు పెరిగినట్లు ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. ఇక ముకేశ్ తర్వాతి స్థానంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. ఆయన సంపద రూ.1.51 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న ప్రేమ్ జీతో పోలిస్తే.. ముకేశ్ సంపద విలువ రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం. భారత అపర కుబేరుల జాబితాలో లక్ష్మీనివాస్ మిట్టల్ రూ.1.31 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో - హిందూజా సోదరులు రూ.1.30 లక్షల కోట్ల సంపదతో నాలుగో స్థానంలో - షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ రూ.1.13 లక్షల కోట్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) చైర్మన్ పిపి రెడ్డి తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆయన సంపద విలువ రూ.22300 కోట్లు. ఫోర్బ్స్ జాబితాలో ఆయన 47వ స్థానంలో నిలిచారు.