మరో వివాదంలో ' సర్కార్‌ '

13:01 - November 15, 2018

' సర్కార్‌ ' తమిళనాట సెన్సేషన్ సృష్టిస్తున్న లేటెస్ట్ మూవీ. విజయ్ హీరోగా మురుగదాస్ రూపొందించిన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ. వసూళ్ళ విషయంలో దూసుకుపోతోంది. 150 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన ' సర్కార్‌ ' ఇప్పుడు 200 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా సాగుతోంది. అయితే  తమిళనాట వివాదాలకు కేంద్ర బిందువుగా నిలచింది ఈ ' సర్కార్‌ ' మూవీ. అవన్నీ సద్దుమణిగాయనుకునేలోపే మరో వ్యవహారం హాట్‌టాపిక్ అయింది. ఈ సినిమా లో  ముఖ్యంగా విలన్ పాత్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను పోలి ఉండడంపై అలాగే మిక్సీలు, టీవీలు, గ్రైండర్లు తగలబెడుతున్న సన్నివేశంపై అన్నాడీఎంకే పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో సినిమా నుంచి ఈ సీన్స్‌ను తొలగించాల్సి వచ్చింది. సినిమాలో మిక్సీలు - గ్రైండర్ సన్నివేశాలను తొలగించినా మురుగదాస్ మరో విధంగా వివాదాన్ని రాజేస్తున్నాడా? అవునన్నదే తమిళ నెటిజన్ల మాట. ' సర్కార్‌ ' విజయం సాధించిన నేపథ్యంలో... తాజాగా చిత్ర యూనిట్ పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు ఓ కేక్ కూడా కట్ చేశారు. ఇప్పుడు ఆ కేక్ వివాదానికి కేంద్రబిందువయింది. ఆ కేక్ లో ఏముందంటారా? ఈ కేక్‌పై ఒక వైపు మిక్సీ, మరోవైపు గ్రైండర్ పెట్టడంతో పాటు ఓటు గుర్తు వేసిన వేలిని కూడా చూపిస్తూ మరో చిన్న బొమ్మ కూడా పెట్టారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేక్ కట్ చేసిన తరువాత  '' ఆ పార్టీకి భయపడి సినిమాలోని ఆయా సన్నివేశాలను తొలగించాం కాని కేక్‌పై మాత్రం తీసేది లేదు '' అంటూ మురుగదాస్ తన యూనిట్ సభ్యులతో జోక్ చేశాడన్నది కోలీవుడ్ సమాచారం.