మరో విమాన ప్రమాదం...25 మంది మృతి

13:01 - October 31, 2018

ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 189 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలడంతో... అందులో ప్రయాణిస్తున్న మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 9:10కు ఫరా ప్రావిన్స్‌లో హెలికాప్టర్ కూలిపోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కొండప్రాంతమైన అనార్ దారా జిల్లా నుంచి హెరాత్ ప్రావిన్స్‌కు బయల్దేరిన కొద్ది సేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అననుకూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్టు ఫరా గవర్నర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మృతుల్లో ఫరా ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులు సహా జాఫర్ మిలటరీ కార్ప్స్ చెందిన సీనియర్ అధికారులు ఉన్నారనీ... ఒక్కరు కూడా సజీవంగా బయటపడలేదని జాఫర్ మిలటరీ కార్ప్స్ ప్రతినిధి నజీబుల్లా నజీబీ వెల్లడించారు.