మరోసారి రెచ్చిపోయిన పృథ్వీ షా

12:51 - October 13, 2018

మొదటి టెస్టులోనే సెంచరీతో చెలరేగిన ఈ యువ సంచలనం షా రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 39 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో విండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ పృథ్వీ షా మరోసారి రెచ్చిపోయాడు. షా దూకుడుతో భారత స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. మొదటి ఓవర్‌లోనే ఫోర్, సిక్స్‌తో విరుచుకుపడిన ఈ కుర్రాడు.. స్పిన్నర్ వర్రీకేన్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. మరో ఓపెనర్ రాహుల్ విండీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్నా.. షా మాత్రం అలవోకగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పృథ్వీ.. ప్రస్తుతం పుజారాతో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. లంచ్ విరామ సమయానికి భారత్ 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.