భారత్‌పై ట్రంప్‌ మరోసారి కఠిన వైఖరి!

14:45 - November 2, 2018

అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌కు షాకిచ్చారు. భారత ఎగుమతి వాణిజ్యాన్ని నీరుగార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎ్‌సపీ) ప్రోగ్రామ్‌ కింద సుంకం రాయితీలు వర్తించే వాటిలో 90 ఉత్పత్తులకు సంబంధించి అమెరికన్‌ ఫెడరల్‌ రిజిస్టర్‌ గురువారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనకు అనుగుణంగా నవంబరు 1 నుంచి ఈ 90 ఉత్పత్తులపై సుంకం రాయితీలను ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అందులో కనీసం 50  ఉత్పతులను భారత్‌ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంటే...భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వాటిలో కనీసం 50  ఉత్పత్తులపై వర్తించే సుంకం రాయితీలను ట్రంప్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అందులో చాలావరకు చేనేత, వ్యవసాయ రంగాలకు చెందిన ఉత్పత్తులే. అమెరికా తాజా నిర్ణయంతో ఈ రెండు రంగాల ఎగుమతులపై, ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి వాణిజ్య సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యంలో ట్రంప్‌ సర్కారు కఠిన వైఖరి అనుసరిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులంటున్నారు. భారత్‌తో పాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌, సురినేమ్‌, పాకిస్థాన్‌కు చెందిన ఉత్పత్తులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. జీఎ్‌సపీ ప్రోగ్రామ్‌లో భాగంగా గత ఏడాదిలో భారత్‌ నుంచి అమెరికాకు సుంకం రాయితీ ఎగుమతులు560 కోట్ల డాలర్లు దాటాయి. మరోవైపు ట్రంప్‌, మోదీ వాణిజ్య అంశాలపై చర్చించినట్లు వైట్‌హౌజ్‌ తెలిపింది.