బీజేపీ బాటలో...కాంగ్రెస్‌

10:23 - November 19, 2018

మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా అధికారం కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్‌ పార్టీ- ఇప్పుడు బీజేపీని అనుసరిస్తోంది. అంతేకాదు దాని ప్రచార పంథాను కూడా మార్చింది. అందేంటీ అనుకుంటున్నారా!..పార్టీలు వేరైనా వారి విధానాలు ఒక్కటే రెండిటి వల్లా ప్రజలకు మేలు జరిగేది ఏమీ లేదు. సరే కాంగ్రెస్‌ మార్చుకున్న ప్రచారం పంథా ఏంటో తెలుసా?..  తాజాగా ఓ పాటను రూపొందించి వాడవాడలా మోతెక్కిస్తోంది. ''  ఆ రహీ హై కాంగ్రెస్‌... పరివర్తన్‌ మాంగే మధ్యప్రదేశ్‌ '' మార్పు కోరుకునే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రాబోతోంది) అని ప్రారంభమయ్యే ఆ గీతం ఇపుడు ఎఫ్‌ఎంల్లో పదేపదే వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పట్ల సానుకూలత ఉండి- ఓటేస్తే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగలుగుతారా అన్న మీమాంసలో ఉన్న ఓటర్లలో విశ్వాసం పాదుకొల్పేందుకు ఈ పాట రూపొందించారు. విశేషమేమంటే- ఈ పాట 2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రూపొందించి వినిపించిన గీతానికి నకలు. ' ఆ రహీ హై భాజపా సర్కార్‌..' అనే పాటలో కొన్ని పదాలను మధ్యప్రదేశ్‌కు అనుగుణంగా మార్చి కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఇదిలా వుంటే ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కూడా యాడ్స్‌, పాటల ప్రచారంలో దూసుకుపోరతుంది. కేవలం ఎన్నికల ప్రకటనల కోసం  బీజేపీ  ఒక్క నెలలోనే 300కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అభివృద్ధిని పక్కనబెట్టి యాడ్స్‌, పాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దన్నుకుందామనుకుంటున్న ఈ రెండు పార్టీలకూ ప్రజలు ఏవిధంగా ఓట్లేస్తారు?. అంతేకాక ప్రజలకు ఉపయోగించాల్సిన డబ్బును వారి ప్రచార ఖర్చులకు కోట్లు ఖర్చుపెడుతున్నారు.