బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి సెగలు!

12:29 - November 3, 2018

బీజేపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. అది ఓ జిల్లా పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి దిగే దాకా.. దిష్టిబొమ్మల దహనం చేసే దాకా వెళ్లింది! బీజేపీ శుక్రవారం 28 మంది అభ్యర్థులతో ప్రకటించిన రెండో జాబితాపై శేరిలింగంపల్లి, నిజామాబాద్‌ అర్బన్‌, వరంగల్‌ వెస్ట్‌, నిర్మల్‌, సిద్దిపేట, సెగ్మెంట్లలో అసంతృప్తులు పెల్లుబికాయి. నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు ఇవ్వడాన్ని నిరసిస్తూ.. పార్టీ నేత ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా వర్గీయులు పార్టీ జిల్లా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కాగా.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పోటీచేస్తానని సూర్య నారాయణ స్పష్టం చేశారు. వరంగల్‌ పశ్చిమ స్థానం టికెట్‌ను తనకు ఇవ్వకపోవడం పట్ల పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ధర్మారావును ప్రకటించారు. తనకు టికెట్‌ వస్తుందంటూ కొందరు నాయకులు నమ్మించి మోసం చేశారని పద్మ ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి టికెట్‌ను వారం క్రితమే పార్టీలో జి.యోగానంద్‌కు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ ఆశావహుడు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ వర్గీయులు, కార్యకర్తలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు యోగానంద్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ గురువారం నుంచి నరేశ్‌, మరో నేత భాస్కర్‌ రెడ్డి దీక్ష చేపట్టారు. శుక్రవారం.. కొంతమంది కార్యకర్తలు పార్టీ కార్యాలయంపైకి ఎక్కి నిరసన తెలిపారు. అంతేకాదు...నిర్మల్‌ అభ్యర్థిగా డాక్టర్‌ స్వర్ణారెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించగా, స్థానికంగా అసమ్మతి బహిర్గతమైంది. ఇక్కడ టికెట్‌ ఆశించిన పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు, వైద్యుడు మల్లికార్జునరెడ్డి, తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. సిద్దిపేట అభ్యర్థిగా నాయిని నరోత్తంరెడ్డి పేరును ప్రకటించడాన్ని నిరసిస్తూ పార్టీ కౌన్సిలర్‌ బసంగారి వెంకట్‌, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.