బీజేపీతో చేతులు కలిపి కేసీఆర్‌ షరతులు: చంద్రబాబు

11:49 - October 7, 2018

తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌..బీజేపీ చేతులు కలిపి తమకు షరతులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీతో జరిగిన చర్చల ప్రక్రియ వివరాలను శనివారం ఇక్కడ టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే దక్షిణాదిలో ఆధిక్యం చూపవచ్చునని, ఢిల్లీలో కూడా తెలుగువారి ప్రాభవానికి ఉపయోగపడుతుందని నేను సూచించాను. ముందు సానుకూలంగానే స్పందించారు. ఆలోచించి చెబుతానన్నారు. కానీ, వారం తర్వాత కలవలేనని చెప్పారు. ఆయనను మరెవరో ప్రభావితం చేస్తున్నారని అప్పుడే అర్ధమైంది. ఆ సమయంలోనే మనకు మరో షరతు పెట్టారు. టీడీపీ పోటీ చేయాలనుకొంటే ఒంటరిగా చేయాలని, కాంగ్రెస్‌తో కలవొద్దని కోరారు. ఆయన బీజేపీ చేతిలో ఇరుక్కొని మనకు షరతులు పెడితే ఎలా, ఆయన దూరంగా ఉంటున్నప్పుడు మన నిర్ణయం మనం తీసుకొంటాం. తెలంగాణలో తాము చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్‌ మరో మాట అన్నారు. ఆయన మాట ఎవరు నమ్మాలి, ఈ ఎన్నికలు గడిచిన తర్వాత ఆయన ఎలా వ్యవహరిస్తారో ఎవరైనా చెప్పగలరా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల వద్ద ఓట్లు పొందగలిగే పరిస్థితిలో కేసీఆర్‌ లేరని, అందుకే ఆంధ్రులను, చంద్రబాబును తిట్టి మరోసారి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప గెలవలేనన్న అభిప్రాయంతో ఈ పని చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం కొంత ఉందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఎలక్షన్‌ షెడ్యూల్‌లో రాజస్థాన్‌ ఎన్నికను చివరకు తెచ్చారని, దీనివల్ల ఆ ఎన్నిక ప్రభావం మిగిలిన రాష్ట్రాలపై పడకుండా చూసుకోగలిగారని ఎంపీలు అన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాక ముందే షెడ్యూల్‌ విడుదల కావడంపై ఈ సమావేశంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం వల్ల ఇక ఏపీ ఎన్నికలు ముందు వస్తాయన్న ఊహాగానాలకు తెర పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.