బన్నీ చెప్పేదానికి, చేసేదానికి పొంతనలేదట!

15:47 - December 20, 2018

ఎవరైనా వేదిక ఎక్కి మంచి మాటలు చెబితే.. అతడిని పొగుడుతారు. ఎంత బాగా చెప్పాడో అంటారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో సీన్ రివర్సవుతోంది. ఎందుకంటే...బన్నీ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదంటూ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు జనాలు. ఈ మధ్య ఏ వేడుకకు వెళ్లినా.. జనాలకు క్లాసులు పీకడం అలవాటైపోయింది బన్నీకి. తాజాగా ‘పడి పడి లేచె మనసు’ ప్రి రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి.. సినిమా వాళ్లను రాజకీయ నాయకుల్ని ‘గారు’ అని సంబోధించమని అన్నాడు. పనిలో పనిగా శర్వానంద్ ను ‘గారు’ అన్నాడు. తన కంటే చిన్న స్థాయి హీరో.. పైగా వ్యక్తిగతంగా మంచి స్నేహం కూడా ఉన్న శర్వాను బన్నీ ‘గారు’ అనడమే ఏదోలా అనిపించింది జనాలకు. ఆ సంగతలా వదిలేస్తే.. ప్రతి ఒక్కరినీ గారూ అని సంబోధించమంటూ కొంచెం యారొగెంట్ గా అన్నాడు బన్నీ. గతంలో అతను పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. పేరు వెనుక ‘గారు’ పెట్టకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు నెటిజన్లు. స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఇదేనా బన్నీ నీ సంస్కారం అని అడుగుతున్నారు. మరోవైపు ఒక వేడుకలో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ పక్కన కాలు మీద కాలేసుకుని పొగురుగా కూర్చోవడం.. అతడి షూ కైకాలకు తాకేలా ఉంటే ఆయన దాన్నే చూస్తున్నట్లుగా ఉన్న ఫొటో కూడా బయటికి లాగారు. ఇలాంటివన్నీ చూపిస్తూ బన్నీ మీద సెటైర్లు పేలుస్తున్నారు జనాలు. అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే.. ‘చెప్పను బ్రదర్’ అంటూ కొంచెం పొగరుగా మాట్లాడిన వైనం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది పవర్ స్టార్ అభిమానులకు నచ్చక అతడి మీద యుద్ధం ప్రకటించారు. ఒక దశలో బన్నీకి.. పవన్ అభిమానులకు మధ్య పెద్ద అగాథం ఏర్పడిపోయింది. దాన్ని ఎంత కవర్ చేద్దామని చూసినా బన్నీ వల్ల కావడం లేదు. ఇప్పుడేమో ‘గారు’ కామెంట్ తో బన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ పేజీలకు మంచి కంటెంట్ ఇచ్చాడు. పరిస్థితి చూస్తుంటే ఇక పై ఇలాంటి ఈవెంట్లలో బన్నీ కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిందే అని స్పష్టమవుతోంది.