బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌లోకి వచ్చింది అందుకేనట!

12:43 - October 10, 2018

బండ్ల గణేష్‌..ఇతని గురించి తెలిసే వుంటుంది. సినిమా ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్‌గా, వ్యాపారవేత్తగా ఈయన అందరికీ సుపరిచితుడే. అయితే ఇటీవల బండ్ల కాంగ్రెస్‌ కండువ కప్పుకున్న విషియం తెలిసిందే. అయితే ఈయన కాంగ్రెస్‌లోకి రాగానే పార్టీ ఆయనకు సీటు ఇస్తుందా? అంటే సమాధానం తెలియదు. కానీ టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే కాంగ్రెస్‌లో చేరారని కొందరు.. కాంగ్రెస్ కీలక నేతలతో బండ్లకు ఉన్న సత్సంబంధాల వల్ల టికెట్‌ ఖాయమవుతుందన్న నమ్మకంతో పార్టీలో చేరినట్లు ఉన్నారని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, బండ్ల గణేష్ తాను పుట్టి పెరిగిన షాద్ నగర్ టికెట్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. తనకు స్థానికంగా ఉన్న వ్యాపార సంబంధాలు, సర్కిల్ తనకు ఓట్లను రాల్చుతుందని బండ్ల భావించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే...షాద్‌ నగర్‌ స్థానాన్ని ప్రతాప్‌ రెడ్డి కి నిర్ణయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు అదే స్థానాన్ని బండ్ల కావలంటున్నారు మరి పార్టీ ఎవరి చేయి పైకిలేపి, ఎవరి చేయి కిందకుంచుతుందో వేచి చూడాలి. చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి 2009లో షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. అయితే పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ప్రతాప్ రెడ్డి షాద్ నగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ వై.అంజయ్య యాదవ్‌నే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతాప్ రెడ్డి మాత్రమే ధీటైన అభ్యర్థిగా కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. షాద్ నగర్ నుంచి బండ్లకు అవకాశం లేదని తేలిపోవడంతో ఇప్పుడు ఎక్కడ నుంచి ఆయన పోటీకి దిగుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇదంతా పక్కన పెడితే బండ్లకు కాంగ్రెస్‌ అసలు సీటు ఇస్తుందా? లేదా? అన్నది పార్టీ తుది జాబితా వచ్చే వరకూ స్పష్టత లేదు.