బంగారం అమ్మకాల్లో మోసం..జర జాగ్రత్త!

11:50 - November 3, 2018

బంగారు నగల కొనుగోలుదారులను వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నమ్మకమైన వ్యాపారం, నాణ్యమైన బంగారం అంటూ ప్రచారాలతో కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్న వ్యాపార సంస్థలు రకరకాల ట్రిక్కులతో కొనుగోలుదారులను దోచుకుంటున్నాయని తూనికలు కొలతల శాఖ అధికారులు తెలిపారు. రకరకాల మోసాలతో కొనుగోలుదారులను నిలువునా దోపిడీ చేస్తున్నట్టు తూనికలు కొలతల శాఖ అధికారులు రెండు రోజులుగా నగరంలో పలు దుకాణాల్లో చేసిన తనిఖీల్లో తేలింది. దీపావళికి రెండు రోజుల ముందు జరిగే ధన త్రయోదశి కోసం వ్యాపారులు రకరకాల ఆఫర్లు, స్కీమ్‌లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో వ్యాపారులు వినియోగదారులకు సరైన ధర, తూకంతో నగలు అమ్ముతున్నారా? లేదా అన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు నిబంధనలను పాటిస్తున్నారా? లేదా అని తెలుసుకునేందుకు తూనికలు కొలతలశాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌... ముగ్గురు డిప్యూటీ కంట్రోలర్స్‌, ఐదుగురు అసిస్టెంట్‌ కంట్రోలర్స్‌ల నేతృత్వంలో 30 మంది అధికారులతో 9 బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. తూనికలు కొలతల శాఖ నిబంధనల ప్రకారం... వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు దుకాణ దారులు ఇచ్చే బిల్లులో కచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్‌ బరువు, ధర విడివిడిగా బిల్లులో చూపించాలి. కొనుగోలు చేసిన రోజు ఉన్న బంగారం ధరతోపాటు 22  కేరట్లు, 24 కేరట్లా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. మేకింగ్‌, వేస్టేజ్‌ని వ్యాట్‌లో కలపడం నిబంధనలకు విరుద్ధం. నికర బరువు (నెట్‌వెయిట్‌) ప్రకారమే ధర వేయాలి. కానీ.. 25 శాతం వరకు వేస్టేజ్‌పేరుతో వినియోగదారుల నుంచి అధికం గా వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న నగల దుకాణాలపై కేసులు నమోదు చేశారు.