ప్రజల పైన బీజేపీ ప్రభుత్వానికి వున్న ప్రేమ..రూపాయిన్నరే..!

12:18 - October 5, 2018

పెట్రోల్‌, డీజిల్‌ పై లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కేంద్రానికి వీటిపై వచ్చే పన్నులే మెజారిటీ వాటా... రోజురోజుకు ముడిచమురు ధరలు పెరుగుతూ పోతుంటే చమురు సంస్థలు పెంచుకుంటూపోతున్నాయి. అయినా దున్నపోతు మీద వాన పడ్డట్టు కేంద్రంలో ఓ ఉలుకూ లేదు.. పలుకూ లేదు. జనాలపై మోడీకి ఒక రోజు కనికరం చూపించాలనిపించిందో ఏమో!..వెంటనే కేంద్రంలోని ఆర్థిక- ఇంకొందరు మంత్రుల్ని పిలిచి పెట్రో ధరపై సమీక్షించారు. సమీక్షించిన మంత్రులు జనాలపై జాలి చూపించి పెట్రోధరను తగ్గించారు. ఆ తగ్గించింది ఎంతో తెలుసా..రెండు రూపాయల యాభై పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. ఇక ఇది తెలిసిని జనాలు మోడీపై పెట్రో మంట మండుతున్నారు. ఎందుకో మీకు తెలిసే వుంటుంది...గడిచిన నాలుగైదు నెలల్లో దాదాపు 15 రూపాయాలకు పైగా పెట్రోల్ ధరలు పెంచిన కేంద్రం ముష్టి రెండున్నర రూపాయలు తగ్గించి జనాలను పండుగ చేసుకోమంటోంది. అందునా ఓ మెలిక కూడా పెట్టారు. ఆ రెండున్నర రూపాయల్లో కేంద్రం తగ్గించేది అసలు రూపాయిన్నర మాత్రమేనట.. మిగతా రూపాయి.. చమురు సంస్థలు తగ్గిస్తాయట.. ఇంత బతుకు బతికీ జనాలకు కేంద్రం ఇచ్చింది రూపాయిన్నర బిచ్చమన్నమాట... దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికున్న ‘ప్రేమ’ చూసి సాధారణ జనాలందరికీ కడుపులో తిప్పుతోందట.. ఇప్పుడందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

2014కు ముందు చమురు ధరలు బ్యారెల్ కు 30 డాలర్లే ఉండేవి. ఇది చాలా తక్కువ. కానీ అప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గించలేదు. పన్నుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాదేశాయి. ఇప్పుడు బ్యారెల్ చమురు 80 డాలర్లకు చేరువైంది. తక్కువున్నప్పుడు కొల్లగొట్టిన ప్రభుత్వాలు ఎక్కువున్న ప్రస్తుతం మాత్రం ఆ భారాన్ని జనాలపై మోపుతున్నాయి. ఇదెక్కడి అన్యాయం అని గొంతుచించుకున్నా ఎవ్వరూ స్పందించని పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో రూపాయి మారక విలువ మరింతగా క్షీణించిపోయింది. అయినా రూపాయి విలువ పడిపోవడానికి నోట్ల రద్దు జీఎస్టీ అస్తవ్యస్త మోడీ ఆర్థిక విధానాలే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి ఓట్లేసి గెలిపించినందుకు ఈ కర్మ అనుభవించాలిందే తప్ప ...చేసేది ఏమీ లేదని, పెట్రో ధరల పెంపుపై నోరు మెదిపే పరిస్థితి లేదని జనాలు భాదపడుతూ కాలం వెల్లదీస్తున్నారు.