ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో..టీఆర్‌ఎస్‌కు తప్పని తిప్పలు

11:43 - October 27, 2018

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను తెరమీదకి తెచ్చి, 105 మంది అభ్యర్థులను అప్పుడే ప్రకటించి, నా పథకాలను చూసి ప్రజలు ఓట్లేస్తారులే...అన్న దీమాతో వున్న కేసీఆర్‌కు ఇప్పుడు ప్రజల వ్యతిరేకతతో గుబులు పట్టుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పట్ల స్థానికులు చూపిస్తున్న వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతుంది.  గడచిన ఎన్నికల్లో గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేలెవ్వరూ తమ దిక్కు చూడలేదనే కోపంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. వివిధ సర్వేలు - నివేదిక ఆధారంగానే సిట్టింగులు అందరికి టిక్కట్లు ఇచ్చారు. కేవలం ఐదారుగురిని మాత్రమే పక్కన పెట్టారు. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కొంప ముంచేలా ఉందంటున్నారు.ప్రజలు తనను - తాను చేసిన అభివృద్ధిని చూసి గెలిపిస్తారని కె.చంద్రశేఖర రావు చాలా నమ్మకంగా ఉన్నారు. రానురాను పరిస్ధితులు అందుకు తగ్గట్టుగా కనిపించడం లేదు. దాదాపు సగం నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధుల ప్రచారంలో చేదు అనుభవమే ఎదురవుతోంది. కొన్ని గ్రామాల్లో ఎందుకొచ్చారంటూ బ్యానర్లు సైతం కట్టడం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఖమ్మం - నిజామాబాద్ - వరంగల్ - కరీంనగర్ - నల్లగొండ వంటి నియోజకవర్గాల్లో అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు తిరగలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు మహాకూటమి అభ్యర్ధులు ప్రకటన తర్వాత పరిస్ధితి ఎలా ఉంటుందో అనే బెంగ అధిష్టానాన్ని పీడిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి తప్పు చేసామా అని పార్టీ సీనియర్లు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఈ వ్యతిరేకత ఎన్నికల టైంకి మరింతగా ముదిరితే టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఎంటి? అని ఇప్పుడు ఆ నాయకుల ముందున్న ప్రశ్న.