' పెళ్లిచూపులు 'తో అనుకున్నదొక్కటి...అయినదొక్కటి

16:55 - November 2, 2018

యాంకర్ ప్రదీప్‌ కు ఓ ఛానల్ ' పెళ్లిచూపులు '  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాంకర్ ప్రదీప్, సుమలకు ఉన్న క్రేజ్‌తో ఈజీగా రేటింగ్స్ పెంచుకోవచ్చని షో నిర్వాహకులు..భావించారు. ఎందుకోగానీ ఆది నుంచే ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పెళ్లి చూపుల కోసం ఆ షో యాజమాన్యం ఎంచుకున్న అమ్మాయిల వల్గారిటీని చూసిన ప్రేక్షకులు ఈ షోపై ఆదిలోనే పెదవి విరిచారు. షోను ఆపేయండంటూ ఎందరో తమ సందేశాల ద్వారా షో యాజమాన్యానికి విన్నవించారు. దీంతో అనుకున్నదొక్కటి...అయినదొక్కటి సందంగా షో నిర్వాహకుల పరిస్థితి తయారైంది. మధ్యమధ్యలో అనసూయ వంటి సెలబ్రిటీలను గెస్ట్‌లుగా షోకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ షో కోసం పనిచేసినందుకు యాంకర్ సుమ, ప్రదీప్‌లపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షో రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో షో నిర్వాహకులకు భారీ నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల నష్టాన్ని ఈ షో నిర్వాహకులు భరించాల్సి వస్తోందట. దీంతో ఇక ఖర్చు భరించలేక షూటింగ్ మొత్తం పూర్తి చేసి మూడు రోజుల క్రితమే అమ్మాయిలందరితో బయట ఎక్కడా కూడా షో పూర్తయ్యేవరకూ ఫోకస్ అవ్వకూడదంటూ సంతకాలు తీసుకుని సెట్ నుంచి పంపించేసినట్టు సమాచారం. ఈ షో ఈనెల 9వ తేదీతో ముగియనుంది.