పెథాయ్ తుపానుకి 28 మంది జాలర్లు గల్లంతు

14:11 - December 18, 2018

పెథాయ్ తుపాను వల్ల భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలకొరగగా, ఆక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తాకిడి నేపథ్యంలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దుమ్ములపేట, పర్లాపేట, ఉప్పలంకకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదు. కాగా, గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును ప్రారంభించారు. అంతకుముందు సముంద్రంలో ఓఎన్ జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అధికారులు కాపాడగలిగారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంలో మత్స్యకారుల కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి.