పులి కోసం...కుక్కల వేట

10:30 - October 9, 2018

మనుషుల కోసం కాపు కాసి మరీ పులి వేటాడుతుంది. అయితే ఇప్పుడు పులి కోసం కుక్కలు వేటాడుతున్నాయి. అదేంటి పులిని చూస్తే పారిపోయే కుక్కలు...పులిని వేటాడటమేమిటి? అనుకుంటున్నారా?. అవును అది నిజం ఇప్పుడు ' మ్యాన్‌ ఈటర్‌ పులి కోసం ఇటాలియన్‌ బ్రిడ్‌ కుక్కలు గాలింపు ' మొదలుపెట్టాయి. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని యావత్‌మాల్ జిల్లా పాండ్రకోడ గ్రామానికి చెందిన14 మంది గొర్రెల కాపరులను ఓ ఆడ పులి చంపేసింది. ఈ ఏడాది ఆగస్టు 4, 11, 28 తేదీల్లో ముగ్గురు గ్రామస్థులను పులి చంపేసింది. దీంతో ప్రజాందోళనతో మ్యాన్ ఈటర్ అయిన పులి కనిపిస్తే కాల్చివేయండి అంటూ అటవీశాఖ , షూట్ ఎట్ సైట్, ఉత్తర్వులు జారీ చేసి, దీన్ని చంపే బాధ్యతను అటవీశాఖ హైదరాబాద్ వేటగాడు, వైల్డ్ లైఫ్ ట్రాన్క్విల్ ఫోర్స్ అధినేత నవాబ్ షఫత్ అలీఖాన్‌కు అప్పగించింది. గత కొంతకాలంగా పులి కోసం గాలిస్తున్నా దాని జాడ మాత్రం లభించలేదు. పులి మూత్రం వాసనతో దాని ఆనవాళ్లు గుర్తించగలిగే ఈ ఇటాలియన్ జాగిలాలను అటవీశాఖాధికారులు పాండ్రకోడకు రప్పించారు. పులి వేట కోసం రప్పించిన జాగిలాల కోసం కుక్కల శిక్షకుడు జ్యోతి రంధ్వాను ఢిల్లీ నుంచి పిలిపించారు. తాజాగా షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌ తోపాటు అతని కుమారుడు అస్ఘర్ ను కూడా పులి కోసం వేటాడే బృందంలో నియమించారు. ఈ పులి తాజాగా రెండు గుర్రాలను చంపేసింది. పులి ఆచూకీ కెమెరా ట్రాప్ లకు లభించక పోవడంతో జాగిలాలను రప్పించారు.ఈ జాగిలాలు పులి ఆచూకీని గుర్తిస్తే దానికి మత్తుమందిచ్చి బంధించాలని అటవీశాఖాధికారులు నిర్ణయించారు. ఒక్కో ఇటాలియన్ జాగిలాన్ని ఆరులక్షల రూపాయలు వెచ్చించి అధికారులు కొనడం జరిగింది. ఇదిలా వుంటే...పులికి క్షమాబిక్షణ పెట్టాలంటూ మరో వాదన తెరమీదకు వచ్చింది.  పులికి క్షమాభిక్ష ప్రసాదించండి అంటూ వన్యప్రాణి పరిరక్షకుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఘటనలో స్టేకు నిరాకరించింది. పులికి క్షమాభిక్ష ప్రసాదించి, షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ' ప్రయత్న ' వన్యప్రాణుల పరిరక్షణ సంస్థ కార్యకర్త అజయ్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా దాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 14 మందిని చంపిన పులిని వేటాడకుండా స్టే విధించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవైపు మ్యాన్ ఈటర్ పులిని వేటాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, తాజాగా పులికి క్షమాభిక్ష ప్రసాదించాలని నాగపూర్ కు చెందిన జంతువుల హక్కుల కార్యకర్త కరిష్మా గలానీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పిటిషన్ సమర్పించారు.