నేను చనిపోయేలోపు ఆ పని చేస్తాను : శివాజీ

17:04 - November 1, 2018

ఆపరేషన్ గరుడ పేరుతో సంచలన విషయాలు వెల్లడించిన  సినీనటుడు శివాజీ మరోమారు అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు.  అయితే ఈ సారి రాష్ర్టానికి సంబంధించినవి కాకుండా - తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన పంచుకున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి తాను పరమ భక్తుడినని తాను చచ్చిపోయేలోపు టీటీడీ ఛైర్మన్ అవుతానని హీరో శివాజీ విశ్వాసం వ్యక్తం చేశారు.  సహజంగా మీడియా ముందుకు తక్కువ వస్తూ... ఒకట్రెండు టీవీ ఛానల్లతో ఎక్కువగా మాట్లాడే శివాజీ తాజాగా అదే రీతిలో ఓ ఛానల్ లో తన అభిప్రాయాలని పంచుకున్నారు. అయితే - శివాజీకి ఈ ధైర్యం దక్కడం వెనుక ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఇచ్చిన భరోసాయే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై నుంచే తన పోరాటం ప్రారంభించానని - ఇప్పుడు టీటీడీలో అంతా సాఫీగా జరుగుతోందని శివాజీ వ్యాఖ్యానించారు.  కాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనానికి దారితీస్తున్నాయి. రాజకీయాల్లో కాకలు తీరిన వారికి సైతం తాము అలంకరించిన ప్రజాప్రతినిధ్య పదవుల కంటే టీటీడీ చైర్మన్ గిరీ పైనే ఎక్కువ ఆశ ఉంటుందనే చర్చ ఉంది. తెలుగు రాష్ర్టాల్లోని ఓ సీనియర్ ఎంపీ అయితే ఇప్పటివరకు ఆ పదవి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఓ ప్రధాన పార్టీకి బినామీ అనే పేరున్న వ్యాపారవేత్త కం ఎంపీ కూడా కొద్దికాలం కిందటి వరకు ఆ పదవి కోసం ప్రయత్నించారు. ఇలా మహామహులే నిరాశకు గురైన పదవి తనకు ఖచ్చితంగా దక్కుతుందని శివాజీ ధీమా వ్యక్తం చేయడం వెనుక `అధికారంలో ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ` అండ ఉందనేది కొందరి వాదన.