నిక్‌ జొనాన్‌కి ఆ పెళ్లి ఇష్టం లేదట!: ' ది కట్‌ ' మ్యాగజైన్‌ కథనం

13:28 - December 6, 2018

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. వివాహ బంధంతో ఒక్కటైన జంటను అందరూ దీవిస్తుంటే ఓ న్యూయార్క్ మ్యాగజైన్ మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేసింది. మ్యాగజైన్‌ విలేకరి మారియా స్మిత్‌ ఈ కథనం రాస్తూ ‘నిక్‌కు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బాలీవుడ్‌ సుందరితో పరిచయం పెంచుకుని సరదాగా ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. కానీ గ్లోబల్‌ స్కాం ఆర్టిస్ట్‌ అయిన ప్రియాంక అతన్ని ఏకంగా పెళ్లి పీటల వరకు నడిపించి తనను వివాహం చేసుకునేలా చేసింది’ అంటూ కథనాన్ని ప్రచురించింది.  ఈ కథనంపై ప్రియాంకా చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అదో పిచ్చి కథనం.ఇటువంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను. ప్రస్తుతం నా వివాహ జీవితం సంతోషంగా గడుస్తోంది. ఇటువంటి వార్తలు నన్ను డిస్టర్బ్‌ చేయలేవు’ అంటూ స్పష్టం చేసింది. ఈ కథనాన్ని మ్యాగజైన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పోస్టు చేసింది. ఈ  కథనంపై నిక్‌ సోదరుడు జో జొనాస్‌ స్పందిస్తూ ‘ఇది చాలా అసహ్యకరమైన కథనం. ఒక మహిళ గురించి ఇలాంటి కథనం రాసినందుకు ఆ పత్రిక సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. నిక్‌, ప్రియాంకలది నిజమైన ప్రేమని సమర్ధించారు. కాగా, ఈ కథనంపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆడవాళ్ల గురించి గొప్పగా రాసే ది కట్‌ మ్యాగజైన్‌ ప్రియాంకపై జాతి వివక్షతో రాసిన కథనం ఇది’ అంటూ సోనమ్‌కపూర్‌ వ్యాఖ్యానించారు. కథనంపై పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన మ్యాగజైన్‌ నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌ నుంచి దాన్ని తొలగించారు.