నా భర్తను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియడంలేదు: రేవంత్‌ భార్య గీత

11:11 - December 4, 2018

తన భర్త ఎక్కడున్నాడో ప్రస్తుతం తెలియడం లేదని, ఆయన్ను అర్ధరాత్రి బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు, ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయాన్ని వెంటనే చెప్పాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సతీమణి గీత డిమాండ్‌ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని, ఆయన్ను ఎక్కడ ఉంచారన్న విషయాన్ని వెంటనే చెప్పాలని అన్నారు. తన భర్తను రహస్య ప్రాంతానికి తరలించడం ఏంటని, ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. కాగా, కోస్గిలో నేడు కేసీఆర్ నిర్వహించనున్న సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో, ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన రేవంత్‌ భార్య గీత, తన భర్త, మరిదితో పాటు 20 మంది ముఖ్య అనుచరులను, మరో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. రేవంత్‌ రెడ్డిని శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారని కొందరు, జడ్చర్ల సమీపంలోని ట్రైనింగ్ అకాడమీలో ఉంచారని మరికొందరు అంటున్నారు. రేవంత్ అరెస్ట్ ను స్పష్టం చేసిన పోలీసు అధికారులు, ఆయన్ను ఎక్కడ ఉంచారన్న విషయమై మాత్రం అధికారిక ప్రకటన వెలువరించక పోవడం గమనార్హం. ఇదంతా ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్‌ నియంతగా చేయిస్తున్నారని కొంతమంది వాదిస్తున్నట్లు సమాచారం.