నా దృష్టంతా భారత్‌కు ఆడటంపైనే : కొహ్లీ

12:47 - October 26, 2018

మ్యాచ్‌..మ్యాచ్‌కు రికార్డులను కొల్లగొడుతూ దూసుకెల్తున్న వైనం, పదేళ్ల కెరీర్‌...టెస్టుల్లో, వన్టేల్లో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు, అయినా ఇప్పటికీ కొత్త ఆడగాడిలో వుండే కసి...నిరూపించుకోవలనే పట్టుదలతోనే ప్రతి పరుగు కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంటాడు..భారత కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ. అధిక తేమతో ఉక్కపోతగా ఉండే విశాఖ తీరాన కింగ్‌ కోహ్లీ.. ఓ వైపు అలసిపోయినట్టు కనిపిస్తున్నా మొన్నటి రెండో వన్డేలో సింగిల్స్‌తో పాటు బౌండరీల వరద పారించాడు. చివరకు మ్యాచ్‌ టైగా ముగియడంతో అతడు చేసిన ప్రతీ పరుగు ఎంత విలువైందో తెలిసొచ్చింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లోనే అతడు అత్యంత వేగంగా 10 వేల రన్స్‌ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నా వన్డే కెరీర్‌లో ఈ స్థితికి చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదు. నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ను పదేళ్లుగా ఆడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను అని చెప్పాడు. దేశానికి ఆడడంకన్నా మించింది లేదని, రికార్డులు సాధించడం తనకు ముఖ్యం కాదని కోహ్లీ అన్నాడు. ' రికార్డులను సాధించాలని నేనెప్పుడూ అనుకోలేదు. నా దృష్టంతా భారత్‌కు ఆడడం పైనే ఉండేది. అందుకే ఆటపైనే దృష్టి పెడుతూ సరైన రీతిలో ముందుకెళితే విజయాలు వస్తాయని భావిస్తున్నాను' అని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ పరుగు కోసం కష్టపడాల్సిందే. జట్టు తరఫున ఆడేందుకు బయట ఎంతో మంది వేచిచూస్తున్నారు. అదే స్థానంలో ఒకప్పుడు నీవు కూడా ఉండే ఉంటావు.. జట్టులోకి వచ్చాక కూడా అప్పటి కసి కనిపించాలి. దేన్నీ తేలిగ్గా తీసుకోకూడదు. ఒకవేళ ఓవర్‌లో ఆరుసార్లు డైవ్‌ చేయాల్సి వస్తే.. జట్టు కోసం కచ్చితంగా చేస్తాను. ఎందుకంటే అది నా విధి. జట్టు ప్రయోజనాలే నాకు ము ఖ్యం అని విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు..