నాన్న సరిగ్గా పనిచేయడంలేదు: కేటీఆర్‌

13:49 - December 5, 2018

గతంలో నేతల మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాజాగా కేటీఆర్‌తో జరిగిన సంభాషణను కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్‌ బయటపెట్టారు. ఇక ఈ సంభాషణలో "అంతా ఓకే. నేను ప్రజల్లో నిత్యమూ తిరుగుతూ అలసిపోయా" అని కేటీఆర్ అంటే "నేను ఊహించగలను. ఎన్నికలపై నేను వింటున్నది నిజమేనా? క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలావుంది? నీ గురించే ఆలోచిస్తున్నాను సోదరా. నువ్వు కష్టపడుతున్నావ్" అని బండ్ల గణేష్ అన్నట్టు ఉంది. ఆపై కేటీఆర్ స్పందిస్తూ, "అవును... ఇవి రాజకీయాలు. పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. మా అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. మా సర్వేలో మెరుపులు లేవు. నాన్న సరిగ్గా పనిచేయట్లేదు. ఇది నాకు పిచ్చి పుట్టిస్తోంది. మేము గెలవకుంటే, నేను యూఎస్ వెళ్లిపోతానేమో. ప్రతిపక్షంలో మాత్రం కూర్చోలేను" అని కేటీఆర్ అన్నారు. దీనిపై బండ్ల స్పందిస్తూ, "అంతా మేలే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో అంతా అయిపోతుంది. వెయిట్ అండ్ సీ. తీరిక చూసుకుని నాకు ఫోన్ చెయ్యి" అనగా కేటీఆర్ సరేనన్నారు. ఈ వాట్స్ యాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికన్నా ముందు కేటీఆర్‌తో జరిగిన సంభాషనను లగడపాటి కూడా బయటపెట్టిన సంగతి తెలిసిందే.