నాకు ఇదొక ఛాలెంజ్‌ : రకుల్‌

12:53 - October 7, 2018

దర్శకుడు క్రిష్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ఏ ముహుర్తాన తీసుకున్నాడో కానీ పరుగులు పెట్టుస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ పాత్రల్లో బాలకృష్ణ, సుమంత్‌ లను పరకాయ ప్రవేశం చేయించారు. దీంతో ఇప్పటిదాకా బయటికి వచ్చిన పోస్టర్స్‌తో హైప్‌ ఎక్కడికో పోయింది. ఇప్పుడు మరో ముఖ్య పాత్రకు రంగం సిద్దమవుతుంది. ఆ పాత్ర మరెవరిదో కాదండి అతిలోక సుందరి శ్రీదేవి.  అనూహ్యంగా కొద్దినెలల క్రితం దుర్మరణం పాలైన శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ లో చేస్తోంది. బడిపంతులులో ఎన్టీఆర్ మనవరాలిగా నటించి ఆ తర్వాత వేటగాడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయనకు హీరోయిన్ గా చేసిన శ్రీదేవి అంటే నందమూరి అభిమానులకు ప్రత్యేకమైన గౌరవం. ఇప్పుడు ఈ పాత్రను రకుల్ ఛాలెంజ్ గా ఫీలవుతోంది. లెజెండ్ గా భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శ్రీదేవి పాత్ర ఒక ఛాలెంజ్ అంటోంది. పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్ళైనా శ్రీదేవిని కలిసే అవకాశం రకుల్ కు రాలేకపోవడం గమనార్హం. అందుకే శ్రీదేవి పాత సినిమాలు చూస్తూ ఆవిడ బాడీ లాంగ్వేజ్ ని ఆకళింపు చేసుకునే పనిలో ఉందట. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్న రకుల్ బాలయ్య సరసన మొదటిసారి జంటగా కనిపించబోతోంది.