దంతాలు తెల్లగా కావాలా..?

15:52 - August 21, 2018

దంతాలు పసుపు రంగులో మార డానికి ముఖ్యమైన కారణాలు పరిశుభ్రత లోపించడం, ఆహారపు ఆలవాట్లు, వయసు పైబడటం, అనారోగ్య కారణాలు, జన్యుపరమైన సమస్యలు కావచ్చు.ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్లను సంప్రదించితే మంచిదని నిపుణలు చెబుతున్నారు.ఇక దంతాలు పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారాలాంటే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

- నూనెలు సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలను కలిగి ఉంటాయి. వాటిలో ఎక్కువగా కొబ్బరి, ఆలివ్‌, నువ్వుల నూనెలు ముఖ్యమైనవి. ఈ నూనెలను కూడా గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే బ్రషింగ్‌ పూర్తి అయిన తరువాత ఇలా చేయాలి. 

- దంతాలు ఎక్కువ పసుపు రంగులో ఉంటే గోరు వెచ్చటి నీటిలో రెండు నుంచి నాలుగు చుక్కల లవంగం నూనెను కలుపుకొని నోటిని పుక్కలించాలి. ఇలా ఐదు నిమిషాలు చేయాలి. రోజూకు రెండు నుంచి మూడు సార్లు చేస్తే చిగుళ్ల సమస్యలు పోవడంతో పాటు దంతాలు తెలుపు రంగులోకి మారతాయి. 

- ఒక చిన్న కప్పులో బేకింగ్‌ సోడా, నీళ్లను సమపాళ్లల్లో కలుపుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్టును దంతాలపై రుద్దాలి. తర్వాత నీటితో బాగా నోటిని శుభ్రం పరచుకోవాలి. బేకింగ్‌ సోడాతో ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
-  యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను నేరుగా దంతాలపై రుద్దడం వల్ల పళ్లపై ఉండే మరకలు, పసుపు రంగు పూర్తిగా తొలగిపోతుంది. అయితే యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను నేరుగా కాకుండా టూత్‌ పేస్టులో కలుపుకొని ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎనామిల్‌ లెయర్‌ దెబ్బతినదు.

- పసుపును నేరుగా దంతాలపై రుద్దడం వల్ల కూడా దంతాలపై ఉండే పసుపు రంగు మాయం అవుతుంది. దాంతో పాటు చిగుళ్ల సమస్యలు కూడా తొలగిపోతాయి. 
-  పసుపును నేరుగా రుద్దుకోవడానికి ఇష్టపడని వారు రెండు చెంచాల పసుపులో ఒక చెంచా కొబ్బరి నూనె, రెండు చెంచాల బేకింగ్‌ సోడా కలుపుకొని దంతాలను శుభ్రపరచుకోవాలి.