తొలిసారిగా- తెలంగాణ చరిత్రలోనే ఎన్నికల బరిలో ట్రాన్స్‌ జెండర్‌

15:40 - November 21, 2018

తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ నిలబడ్డారు. సామాజిక న్యాయమే సమగ్రాభివృధ్ది నినాదంతో అన్ని సామాజిక వర్గాలనూ కలుపుకున్న బీఎల్‌ఎఫ్‌ ఓ ట్రాన్స్‌ జెండర్‌కు ఈ అవకాశాన్ని కలిపించింది. అంతేకాదు బీసీలకు 60 సీట్లను కేటాయించి బీఎల్‌ఎఫ్‌ సామాజిక న్యాయాన్ని చూపించింది. ఇలాంటి పని ఎప్పటి నుంచో వున్న ఏ పార్టీ కూడా చేయలేకపోయింది. ఇదిలా వుంటే...బీఎల్‌ఎఫ్‌ నిలబెట్టిన ఈ ట్రాన్స్‌ జెండర్‌ అభ్యర్థి పోటీచేసే నియోజకవర్గం గోషామహాల్‌. ఇప్పుడు ఈ నియోజకవర్గం పై అందరి చూపూ పడింది.  బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే - ప్రముఖ హిందుత్వవాది అయిన రాజా సింగ్ బరిలో దిగుతున్నందుకు మాత్రమే ఈ నియోజకవర్గం వార్తల్లో నిలవడం లేదు. తొలిసారిగా - తెలంగాణ చరిత్రలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ ఎఫ్) అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ చంద్రముఖి పోటీ చేయనున్నారు. ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రముఖి కొంతకాలంగా పోరాడుతున్నారు. ఈ మేరకు బీఎల్ ఎఫ్ నాయకులు ఆహ్వానించి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించినట్లు చంద్రముఖి చెప్పారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని - అందరితో సమానంగా తమకు గౌరవం దక్కాలంటే తాము చట్టసభల్లో ఉండాలనే ఆలోచనతో పోటీ చేస్తున్నానని తెలిపారు. గోషామహల్ ప్రాంతంలో అత్యధికంగా ట్రాన్స్ జెండర్లు జీవనం సాగిస్తున్నారని - ఇక్కడి నుంచి పోటీ చేస్తేనే ఆశించిన స్థాయిలో గౌరవం లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఇక్కడ బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ - కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ల మధ్య రసవత్తర పోటీ ఖాయమైన నేపథ్యంలో ఈమె రాకతో గోషామహల్ పై మరింత ఆసక్తి పెరిగింది. నామినేషన్ వేసిన అనంతరం చంద్రముఖి మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని అన్ని ముఖ్య పార్టీలని కోరినట్లు చంద్రముఖి(32) తెలిపారు. అయితే అందరు తిరస్కరించినా చివరకు బీఎల్ ఎఫ్ తనకు అవకాశం కల్పించిందన్నారు. బీఎల్ ఎఫ్ భీపారంపై ఆమె నామినేషన్ వేసినట్లు తెలిపిన ఆమె...ఈ  అవకాశం కల్పించిన సీపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చంద్రముఖి తెలిపారు.