తేజు కోసం ఈసారి ముందునుంచే చిరూ...

13:24 - November 2, 2018

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ఊపును చూసి మొదట్లో మరో స్టార్ వచ్చాడని అనుకున్నారు. కొంత కాలానికే అది కాస్తా రివర్స్‌ అయింది. వరసుబెట్టి ఫ్లాప్‌లతో సాయి ధరమ్‌ తేజ్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అది ఎంతలా అంటే డబల్ డిజాస్టర్ హ్యాట్రిక్ మూటగట్టుకునేంతవరకూ వెళ్ళింది.  ఇక లాభం లేదనుకుని ఓ మూడు నెలలు బ్రేక్ తీసుకున్నాడు తేజు.  ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్ర లహరి' ప్రారంభం అయింది. ఈ సినిమా విజయం తేజూకి చాలా కీలకం కావడంతో మావయ్య చిరంజీవినిని కలిసి స్క్రిప్ట్ విషయంలో ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేయమని కోరాడట. దీంతో మేనల్లుడి కోసం స్క్రిప్ట్ ను పరిశీలించి కొన్ని మార్పుచేర్పులు సూచించారట మెగాస్టార్.  సహజంగా చిరు తేజు సినిమాల విషయంలో ఎడిటింగ్ సమయంలో ఏవైనా మార్పు చేర్పులుంటే సూచనలు అందిస్తారు. కానీ  ఈసారి మాత్రం షూటింగ్ కంటే ముందే తేజు సినిమాకి తన సూచనలు అందించడం విశేషం. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతోనైనా తనకు విజయం లభిస్తుందని తేజు నమ్మకంగా ఉన్నాడు.