తెలంగాణలో మొదలైన ఓట్ల కౌంటింగ్‌

08:25 - December 11, 2018

తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం మొదలైంది. అభ్యర్థుల్లో ఉత్కంఠ మరింతగా పెరిగిపోతుంది. కొన్ని గంటల్లో అన్ని ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మంది సిబ్బందితో కౌంటింగ్‌‌‌లో పాల్గొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనంతరం ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. ఉదయం 9 గంటల కల్లా ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 13 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను ఈసీ నిషేధించింది. శేరిలింగంపల్లిలో గరిష్టంగా 42రౌండ్లు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా  12 రౌండ్లు ఉంటాయి. తెలంగాణలో119 నియోజకవర్గాల్లో 1821మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.