తికమక పెడుతున్న లగడపాటి సర్వే

11:51 - December 8, 2018

తెలంగాణలో ఎన్నికలకు శుక్రవారం పోలింగ్‌ పూర్తయింది. అప్పటి వరకూ ప్రచారాలలో బిజీగా వున్న అభ్యర్థులు, కార్యకర్తలు అంతా శుక్రవారం సాయంత్రం న్యూస్‌ ఛానల్స్‌లో వెలువడే సర్వేల కోసం పడిగాపులు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ వస్తుందా?...మహాకూటమి వస్తుందా? అంటూ అందరిలో ఎదురుచూపులు ఆసక్తికరంగా వున్నాయి. ఎన్నికల ఫలితాలపై జాతీయ పత్రికలు, ఛానల్స్‌ ప్రకటించిన సర్వేలు ఒకలా ఉంటే.. పార్టీల వారీగా మరో రకమైన సర్వేలను ప్రకటించారు. వీటన్నింటినీ తలదన్నే విధంగా లగడపాటి రాజగోపాల్‌ సర్వే అందరినీ గందరగోళంలోకి నెట్టేసింది. తెలంగాణ కోటపై మహాకూటమి పైచేయి సాధిస్తుందని గణాంకాలతో సహా లగడపాటి ప్రకటించిన తరువాత ఈ ప్రాంతంలో జరిగే బెట్టింగ్‌లపై దాని ప్రభావం పడింది. బెట్టింగ్‌లకు మారు పేరైన భీమవరం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నుంచి సరికొత్త వాతావరణం నెలకొంది. పోలింగ్‌కు ముందు మూడు రోజులు టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమంటూ కోట్ల కొద్దీ బెట్టింగ్‌లు సాగాయి. భీమవరం పోకడను బట్టి మిగతా ప్రాంతాల్లోనూ పందెంరాయుళ్లు ఎప్పటికప్పుడు తమ బెట్టింగ్‌లను మారుస్తారు. ఇదే పరిస్థితి శుక్రవారం మరోమారు పునరావృతం అయినట్టుగా భావిస్తున్నారు. అన్ని సర్వేలు ఒక దిశగా ఉండగా, ఎన్నికల్లో సర్వేల్లో సిద్ధ్దహస్తుడైన లగడపాటి రాజగోపాల్‌ మాత్రం తెలంగాణలో మహాకూటమికే అవకాశం ఉన్నట్టు మరోమారు బాంబు పేల్చారు. ఇప్పటి వరకు రాజగోపాల్‌ సర్వేలపై పూర్తి విశ్వసనీయతవున్న వారంతా పునరాలోచనలో పడ్డారు. అసలు ఎందుకిలా జరిగిందనే విషయాన్ని పక్కనపెట్టి.. తెలంగాణలో మహాకూటమి అవకాశాలు ఉన్నట్టు పందాల్లో మార్పులు, చేర్పులు చేశారు. దీనికి తగ్గట్టుగానే తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు వంటి ముఖ్య పట్టణాలన్నింటిలోనూ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పందెం కాసిన వారే మరో అడుగు ముందుకు వేసి అంతకు రెండింతలు కలుపుకుని కూటమి దిశగా పందాలు ఆరంభించారు. '  ఈసారి సర్వేలన్నీ కొత్త గందరగోళం రేపాయి. ఎప్పుడూ భీమవరంలో జరిగే పందెం పైచేయిగా ఉంటుంది. సెంటిమెంట్‌గా ఇక్కడ ఏ వైపు మొగ్గు చూపితే అక్షరాలా అదే జరిగి తీరుతుంది. ఆ నమ్మకంతోనే దాదాపు అందరూ టీఆర్‌ఎస్‌కు 50  సీట్లు పైబడి లభిస్తాయని స్థోమతను బట్టి పందెం కట్టారు. లగడపాటి సర్వే కాస్తా ఇప్పుడు తికమక పెట్టింది'  అని భీమవరానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి కామెంట్‌ చేశాడు. ఇదేకాదు.. ఎవరంతట వారుగా తమకు తెలిసిన సమాచారాన్ని బేరీజు వేసుకుని ఇంకా పందాల్లో చెలరేగిపోతూనే ఉన్నారు. అన్నిటికంటే మించి అధికార తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ వర్గాల్లో మాత్రం తాజా ఎన్నికల సర్వేలు తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి. తమ రాజకీయ భవితవ్యంపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని వీరంతా భావిస్తున్నారు. వివిధ పార్టీల అనుకూలురు సర్వే ఫలితాలపై చర్చకు దిగుతూ లగడపాటి సర్వే విషయానికి వచ్చేసరికి జగడానికి దిగుతున్నారు. ఏది నిజమనే దానిపై కాస్త ఉత్కంఠకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఫలితాలు విడుదలయ్యే 11వ తేదీ వరకూ టెన్షన్‌ తప్పదు.