తారక్‌కు బాలయ్య అందుకే దగ్గరవుతున్నారా?

12:35 - October 22, 2018

నిన్న అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్ సందర్భంగా బాలయ్య, కళ్యాణ్ రామ్,  జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదిక మీద కనిపించడం అభిమానులకు సంతోషంగానే ఉన్నా బయటికి చెప్పుకోలేని వెలితి వెంటాడుతోందని విన్పిస్తున్న కామెంట్స్ ని బట్టి అర్థమవుతోంది.  2008లో సింహ వేడుకలో తారక్ కనిపించాడు కానీ జూనియర్ కోసం బాలయ్య వచ్చి చాలా ఏళ్ళు దాటింది. అప్పుడు అన్నయ్య హరికృష్ణ ఉన్నాడు కదా అని సమర్ధించుకోవడానికి లేదు. ఆయన బ్రతికున్నప్పుడే సినిమాలు రాజకీయాలకు స్వస్తి చెప్పి విశ్రాంతికి పరిమితమయ్యారు. నందమూరి కుటుంబం నుంచి సినిమా రంగంలో ప్రాతినిధ్యం ఇమేజ్ ఒక్క బాలకృష్ణకు మాత్రమే ఉంది.  అయినా సినిమాల ప్రమోషన్ పరంగా బాలయ్య ఏనాడూ కళ్యాణ్ రామ్-తారక్ లను దగ్గరకు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందులోనూ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదల నేపధ్యంలో ఇలా దగ్గర కావడం వెనుక ఎవరి ప్రమేయం ఉందోనని గట్టి చర్చలే జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో లోకేష్ ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో టిడిపి వ్యవహారాలకు తారక్ ను కావాలనే దూరం పెట్టారని ఇప్పుడు మళ్ళి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు ప్రోద్బలంతోనే తారక్ ను దగ్గరకు తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పవన్ టిడిపితో కటీఫ్ చేసుకున్నాడు కాబట్టి ప్రచారం పరంగా బలంగా ఉండాలి అంటే జూనియర్ అవసరం ఉందని గుర్తించే ఇలా విజయోత్సవ వేడుకను ఉపయోగించుకున్నారా అనే అనుమానం కలగడం సహజం. కొందరు తారక్ వీరాభిమానులు ట్విట్టర్ వేదిక తమ అసంతృప్తిని వెళ్లగక్కారు కూడా.