తన కూతురు చేసిన పనికీ...భావోద్వేగానికి గురైన హీరో రాజేంద్ర ప్రసాద్‌

13:33 - October 1, 2018

ఎప్పుడూ నవ్వుతూ..నవ్విస్తూ వుంటూ, ఆయన సినిమాల్ల్లో కూడా నవ్వులకే ప్రాధాన్యం ఇచ్చే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ తన కూతురు చేసిన పనిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.  రాజేంద్ర ప్రసాద్‌ తాజాగా నటించిన చిత్రం బేవర్స్. పేరు కాస్త తేడాగా ఉన్నట్లు అనిపించినా.. కాస్త విషయం ఉన్న సినిమాగా చెబుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం  జరిగింది. 

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ఎప్పుడూ లేని రీతిలో ఎమోషనల్ అయ్యారు. తన వ్యక్తిగత అంశాల్ని వెల్లడించారు. తన కుమార్తె చేసిన పనిని గుర్తు చేసుకుంటూ.. తల్లి లేనోడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడని.. తన పదో ఏటనే తన తన తల్లి చనిపోయినట్లు చెప్పారు. తనకు ఒక్కతే కుమార్తె అని.. పేరు గాయత్రి అని చెప్పారు. ఆమెతో తాను మాట్లాడనని.. ఎందుకంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయిందన్నారు.  ఇవన్నీ మామూలు విషయాలే అయినా.. ఈ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన పాట '' తల్లీ తల్లీ చిట్టితల్లీ.. నా ప్రాణాలే పోయాయమ్మా ''  పాట తనకెంతో నచ్చిందన్నారు. ఈ పాట  విన్నాక మాత్రం తన కుమార్తెను ఇంటికి పిలిపించి.. ఈ పాటను నాలుగైదుసార్లు వినిపించిన వాడినన్న ఆయన.. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తాను ఎడవలేదన్నారు. కానీ కూతురు వెళ్లిపోయినప్పుడు మాత్రం ఏడ్చానన్నారు. 
బేవార్స్ టైటిల్ ఏంటి? అని అనుకుంటారు కానీ.. పేరెంట్స్ ను అర్థం చేసుకోలేని పిల్లలే బేవార్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవార్సే అన్నారు. ఎప్పుడూ వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించని రాజేంద్రప్రసాద్ మరీ ఇంతలా భావోద్వేగానికి గురి కావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.