టీజేఎస్‌కు గుర్తు సమస్య

11:06 - December 14, 2018

ఓటమి భారంతో ఉన్న టీజేఎస్‌ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అగ్గిపెట్టె గుర్తుతో అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. పోటీ చేసిన ఎనిమిది మందిలో ఏడుగురి డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో ఆ పార్టీకి ఎన్నికల సంఘం వద్ద  ' గుర్తింపు  ' వచ్చే అవకాశం కూడా పోయింది. దీంతో ఆ పార్టీకి పార్టీ గుర్తుగా  ' అగ్గిపెట్టె  ' ఉంటుందా? లేదా? అనే ఆందోళన టీజేఎస్‌ నేతలను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కేటాయించిన అగ్గిపెట్టె గుర్తును తమకే ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆ పార్టీ దృష్టి సారించింది. రానున్న పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకున్నా.. కనీసం ఎంపిక చేసిన స్థానాల్లో పోటీ చేయాలని, తద్వారా నేతలను ఉత్సాహపరిచే అవకాశం వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. తద్వారా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోని ఫ్రీ సింబల్స్‌లో నుంచి అగ్గిపెట్టె గుర్తును టీజేఎ్‌సకు కేటాయించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ గుర్తు ఫ్రీ సింబల్స్‌లో ఉంటేనే దాన్ని తమకు కేటాయించాలని కోరే అవకాశం ఉంటుంది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు టీజేఎ్‌సను కలవర పెడుతుంటే వాటి తర్వాత రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తును తిరిగి పొందే విషయమై ఆ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.