టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యం కనబర్చేందుకు కలిసొచ్చిన కారణాలేంటి?

16:18 - December 11, 2018

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సారథ్యంలో మరోసారి ఆ పార్టీ అధికార పగ్గాలు చేబట్టబోతోంది. ఈ దఫా ఎన్నికల్లో ఫలితాలు నెక్‌టూ నెక్‌ ఉంటాయని అంతా భావించిన పరిస్థితి తారుమారైంది. వార్‌ వన్‌సైడే అన్నట్లుగా రిజల్ట్స్‌ వచ్చాయి. ఒక్కసారిగా ఇంత ఊపురావడంలో కేసీఆర్‌ ఊపుకంటే...ప్రతిపక్షాల వైఫల్యమే అధికంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మహాకూటమి పొత్తులు నామినేషన్ల గడువు దగ్గర పడే వరకూ తేలకపోవడం, రెబల్స్‌ బెడదను చక్కదిద్దకపోవడంతో కాంగ్రెస్‌ చేజేతులా మునిగిందనే వాదన వినిపిస్తోంది. అన్నింటినీ మించి మహాకూటమి చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేయడంతోనే కూటమి పుట్టిమునిగిందని ఇంకో వెర్షన్‌. అయితే దీన్ని కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ వెర్షన్‌లోకి మార్చుకోని ప్రచారంలో దూసుకుపోయారు. ప్రగతినివేదన సభ ఫ్లాప్‌ అయిన తరువాత దాన్ని ప్లస్‌గా మార్చుకోవడానికి కాంగ్రెస్‌ ప్రత్యేకంగా తీసుకొన్న చొరవ కూడా ఏమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షంగా అధికార పార్టీపై వచ్చే వ్యతిరేకతపై ఆధారపడటం తప్పా...ప్రజల పక్షాన చెప్పుకోదగ్గ ఆందోళనలు చేపట్టింది లేదు. అంతకుముందు 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ వైఫల్యాలే..అభివృద్ధికి అవరోధాలుగా మిగిలాయనే టీఆర్‌ఎస్‌ నేతల వాదన కూడా ప్రజలు వినిపించుకునే పరిస్థితి వచ్చింది. అంతేగాక అసంపూర్తిగా ఉన్న మిషన్‌భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు మరో అవకాశం ఇవ్వాలనే టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తికి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవన్నీ వెరసి మళ్లీ తెలంగాణ పీఠంను కేసీఆర్‌కు బంగారు పల్లెంలో పెట్టి అందించినట్లయ్యింది.