టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నాయకులపై మొదలైన ఈసీ నోటీసుల జులూం

16:48 - November 22, 2018

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణలోని ఐదుగురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.  తెలంగాణ చీఫ్ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ఈ మేరకు తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు - కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి - వంటేరు ప్రతాప్ రెడ్డి తోపాటు టీడీపీ నేతల రేవూరి ప్రకాష్ రెడ్డిలకు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురితోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఓ మతపరమైన మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేశామని.. ఆయన నుంచి వివరణ కోసం ఎదురుచూస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు.  టీఆర్ ఎస్ అభ్యర్థి - కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని బెదిరించారని.. దానిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని.. తగిన చర్యలు తీసుకుంటామని రజత్ తెలిపారు. ఇదిలావుంటే...ప్రస్తుతం తిరస్కరణల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3583 నామినేషన్లు వచ్చాయని రజత్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ వ్యాప్తంగా 32796 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. భద్రత కోసం 48000 మంది పోలీసులను వినియోగించనున్నామని తెలిపారు. వీరితోపాటు 279 కంపెనీల కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ (సీపీఎంఎఫ్) కూడా ఎన్నికల కోసం వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.