టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలదీస్తున్న ప్రజలు

11:04 - October 24, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరతీశారు. అసెంబ్లీ రద్దు, 105 అభ్యర్తుల జాబితా విడుదల, ఎన్నికల పోలింగ్‌ డేట్‌ ఇవన్నీ అంతా హడావుడిగా జరిగిపోయాయి. ఇక్కడి వరకూ బాగానే వుంది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓట్లడగటానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎక్కడిక వెళ్లినా అసలు మీకెందుకు ఓటెయ్యాలి, గతంలో ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో మంగళవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తుంగతుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ను కొందరు యువకులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పుడు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదని.. కిషోర్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, యువకుల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. మరోవైపు.. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో ప్రచారానికి వచ్చిన వొడితెల సతీశ్‌కుమార్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎ్‌సకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని, ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ మహిళలు నిరసన తెలిపారు.